ప్రధానమంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ : బీజేపీ నేత ప్రతిపాదన
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ.. పశ్చిమ్‌బంగ రాష్ట్రం నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటే.. మమతా బెనర్జీ ఆ పదవికి ఉత్తమ ఎంపిక అని వ్యాఖ్యానించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ 'ప్రధాని అభ్యర్థిని పశ్చిమ్‌బంగ నుంచి ఎన్నుకుంటే.. మమతానే ఉత్తమ ఎంపిక. ప్రధాని కావాలని ఆమె కలలు కంటున్నారు. ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. అయితే వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడతారు' అని ఘోష్ వ్యాఖ్యానించారు.
'గతంలో పశ్చిమ్ బంగ నుంచి ప్రధాని అయ్యే అవకాశం జ్యోతిబసుకు వచ్చింది. సీపీఎం అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు బెంగాల్ నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటే.. మమతకే మొదటి అవకాశం' అని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని మమత అడ్డుకున్న విషయాన్ని కూడా ఎవరూ మరిచిపోలేరని ఆయన గుర్తుచేశారు.