ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు
ఆవు పేడ కుప్పలో ఏకంగా 20 లక్షల రూపాయల నగదును చిక్కింది. పేడ కుప్పలో అంత డబ్బును దాచి పెట్టడం ఇపుడు పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ డబ్బు ఒరిస్సా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నగరంలో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడు. ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొని... బాలాసోర్ జిల్లాలో ఉన్న బాదమందరుని గ్రామంలో నిందితుడి అత్తమామల ఇంట్లోని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆవు పేడ కుప్పలో దాచిన డబ్బును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు. డబ్బు కొట్టేసిన నిందితుడి పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని చెప్పారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు.
డబ్బుని తన బావ రవీంద్ర బెహెరా చేతికి ఇచ్చి గ్రామానికి పంపించాడని, కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా డబ్బు పట్టుబడిందని కమర్డ పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రేమదా నాయక్ ప్రకటించారు. నిందితులు గోపాల్, అతడి బావ రవీంద్ర ఇద్దరూ పరారయ్యారని తెలిపారు. గ్రామంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని ప్రేమదా నాయక్ తెలిపారు.