ఉక్రెయిన్‌ను తక్షణం ఖాళీ చేయండి : భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
ఉక్రెయిన్ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించేందుకు రష్యా సేనలు సర్వసిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యాలను అత్యాధునిక అస్త్రాలను ఎక్కుపెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ కారణంగా ఉక్రెయిన్ - రష్యాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు.
దీంతో ఉక్రెయిన్‌లో భారత పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాల్సిందిగా కేంద్రం హెచ్చరిక చేసింది. అత్యవసరమైతే మినహా ఉక్రెయిన్‌లో ఉండొద్దని కోరింది. విద్యార్థులతో సహా భారతీయులంతా అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టెర్డ్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి బయటపడాలని పేర్కొంది.
ముఖ్యంగా, విద్యార్థులు స్టూడెంట్ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండాలని, తాజా సమాచారం కోసం భారత హైకమిషన్ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికపుడు పరిశీలిస్తుండాలని సూచన చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, ఏ క్షణమైనా రష్యా విరుచుకుపడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలోని భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. తక్షణం ఆ దేశాన్ని వీడాలని సూచన చేసింది.