మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (15:38 IST)

పొంచివున్న యుద్ధం... ప్రతీకార దాడులకు సిద్ధం కావాలి : స్వామి పిలుపు

భారత్, చైనా దేశాల సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివుంది. ఇరు దేశాలు పోటాపోటీగా సరిహద్దుల్లో బలగాలను మొహరిస్తున్నాయి. ఆయుధాలను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
చైనా యుద్ధానికి సన్నద్ధమవుతోందని, డ్రాగన్ కంట్రీ యుద్ధ విమానాలు తరుముకొస్తున్నాయని చెప్పారు. ఇకనైనా శాంతి మంత్రం జపించడం మానుకుని ప్రతీకారదాడులకు సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన గుర్తుచేశారు. 
 
భారత్ - చైనా దేశ సైనికుల మధ్య గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చేందుకు యత్నించగా... ఇండియన్ ఆర్మీ వారిని అడ్డుకున్నారు. ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. 
 
అదేసమయంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నవరాణె లఢక్ పర్యటనలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆయన లేహ్ ఆర్మీ బేస్‌లో ఉన్నారు. గురువారం ఢిల్లీ నుంచి ఆయన నేరుగా లేహ్ బేస్ క్యాంపుకు చేరుకున్నారు. సరిహద్దు భద్రత, సైనికులు, యుద్ధ విమానాల మోహరింపుపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన పర్యటన రెండు రోజుల పాటు అక్కడ కొనసాగనుంది. 
 
ఇదిలావుండగా, తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై భారత్‌ దాదాపు పట్టు సాధించింది. సరస్సు దక్షిణ ప్రాంతంలోకి చొరబడేందుకు చైనా గత నెల 30వ తేదీన చేసిన ప్రయత్నాలను వమ్ముచేసిన భారత సైన్యం.. అక్కడి వ్యూహాత్మక శిఖరాలపై స్థావరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రాంతంలోనూ బలగాలను మోహరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 
 
అంతేకాకుండా, పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని... వ్యూహాత్మక ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో చైనా బిత్తరపోయింది. ఈ స్థావరాల ఏర్పాటుతో చైనా కదలికలను గమనించేందుకు భారత్‌కు అవకాశం కలిగింది. ఇప్పుడు సరస్సు ఉత్తర ప్రాంతాన్ని కూడా అధీనంలోకి తీసుకుని చైనా బలగాలకు అభిముఖంగా మోహరించింది.