బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (15:52 IST)

గత మూడేళ్లలో 329 పులులు మృత్యువాత : కేంద్రం

tiger
దేశ వ్యాప్తంగా గత మూడేళ్ల కాలంలో 329కి పైగా పులులు మృతి చెందినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, మంగళవారం లోక్‌సభలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో గత మూడేళ్ళ కాలంలో మొత్తం 329 పులులు చనిపోయాయని తెలిపారు. 
 
గత 2019లో 96 పులులు, 2020లో 106, 2021లో 127 చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వీటిలో ప్రకృతి విపత్తుల కారణంగా 69, ఇతర కారణాల వల్ల 35, వేటాడటం వల్ల 29 చనిపోయినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన 197 పులుల మృతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. 
 
ప్రధానంగా గత 2019 కంటే 2021లో పులుల వేట గణనీయంగా తగ్గిందన్నారు. పులుల వేట సాగించే సమయంలో 125 మంది వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే, గత మూడేళ్లలో 307 ఏనుగులు విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, అనారోగ్యం, వేటాడటం వల్ల చనిపోయాయని వివరించారు. 
 
వీటిలో 222 ఏనుగులు విద్యుదాఘాతానికి చనిపోగా, వీటిలో ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలోనే 41, తమిళనాడులో 34, అస్సాంలో 33 చొప్పున ఏనుగులు మృత్యువాతపడ్డాయని తెలిపారు.