బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (12:19 IST)

క్రికెట్ స్టేడియంలో చెత్త ఏరుతూ కనిపించిన పోలీస్ కమిషనర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అనే ప్రాజెక్టును చేపట్టారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యం కోసం ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా, స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశంలో పరిశుభ్రంగా ఉండే నగరాలను ఎంపిక చేసిన వాటికి క్లీన్ సిటీస్ పేరుతో ప్రోత్సాహక అవార్డులను కూడా ప్రధానం చేస్తూ వస్తోంది. 
 
ఈ ప్రాజెక్టు అమలుకు గ్రామీణ ప్రజల నుంచి బ్యూరోక్రాట్ల వరకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ క్రికెట్ స్టేడియంలో చెత్త ఏరుతూ కెమెరా కంటికి చిక్కారు. ఆ ఆఫీసర్ ఎవరో కాదు కాన్పూరు సిటీ పోలీస్ కమిషనర్. పేరు అసీం అరుణ్. 
 
కాన్పూర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ప్రేక్షకులంతా స్టాండ్స్‌ను వెళ్లిపోయిన తర్వాత శుక్రవారం ఆయన స్టేడియాన్ని క్లీన్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. 
 
మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు తినిపారేసిన చెత్తాచెదారం, మంచినీళ్ళ సీసాలతో పాటు స్టాండ్స్‌లోని ఇతర చెత్తను ఏరి సంచిలో వేస్తూ కనిపించారు. దీన్ని ఎవరో చూసి తమ మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. 
 
తాను స్టేడియాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో చెత్త ఏరుతున్న తన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీస్ కమిషనర్ అసీం అరుణ్ స్పందించారు. కాన్పూర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సూచనలతో తానే ఆ పనికి పూనుకున్నట్టు చెప్పారు. 
 
గ్రీన్‌పార్క్‌ (స్టేడియం)తో తన పనిని ప్రారంభిచే అవకాశాన్ని కాన్పూరు వాసులు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరోవైపు సాక్షాత్ పోలీస్ కమిషనరే స్వయంగా చెత్త ఏరడాన్ని చూసిన పలువురు యువకులు కూడా తమకుతాముగా చెత్త ఏరేందుకు పూనుకోవడం గమనార్హం.