గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (15:15 IST)

జమ్మూకాశ్మీర్‌లో బోల్తాపడిన బస్సు - ఆరుగురు జవాన్లు మృతి

bus falldown
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన జవాన్లలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. 
 
పవిత్ర అమర్నాథ్ యాత్ర కోసం వేలాది మంది భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరిలో 37 మంది ఐటీబీపీ జవాన్లు, ఇద్దరు జమ్మూకాశ్మీర్ సివిల్ పోలీసులు ఉన్నారు. వీరంతా తమ విధులను ముగించుకుని తిరిగి వెళుతుండగా, బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పహల్ గాం నదిలో బోల్తాపడింది. అయితే, బస్సు బడిన ప్రమాదం చాలా లోతుగా ఉండటంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆంబులెన్స్‌లను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అనంత నాగ్‌లోని  ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్ అంబులెన్సులలో శ్రీనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, ప్రమాద వార్త తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఐటీబీపీ ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడారు. ఈ ప్రమాదం పట్ల తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి తగిన చికిత్స అందించాలని అధికారవర్గాలను ఆదేశించారు.