గ్లాసుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయ్.. ఈసీకి ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసును కేటాయించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ గుర్తునే జనసేనకు కేటాయించింది. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
తమ పార్టీకి గాజు గ్లాసును కేటాయించిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. తన చిన్నతనం నుంచి గాజు గ్లాసుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. మన దేశంలోని సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదేనని అన్నారు. అ సందర్భంగా గాజు గ్లాసు ఫొటోను అప్ లోడ్ చేశారు.
కాగా, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తన ఎన్నికల గుర్తును ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాజు గుర్తుపై పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది.
ఇందులోభాగంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు.
పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నక్రమంలో… అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుందని తెలిపింది ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని తమ పార్టీ ట్వట్టర్ ఖాతాలో జనసేన అధికారికంగా ప్రకటించింది.