శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (10:25 IST)

రోజుకు 14 నుంచి 15 గంటల పాటు పని చేస్తున్న భారతీయ న్యాయమూర్తులు

pratibha singh
మన దేశంలోని కోర్టుల్లో న్యాయమూర్తులుగా ఉండేవారు సరిగా పని చేయరంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. అయితే, ఈ ఆరోపణలను, ప్రచారాన్ని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ తోసిపుచ్చారు. వాస్తవానికి భారతీయ జడ్జిలు రోజుకు సగటున 14 నుంచి 15 గంటల పాటు పనిచేస్తారని తెలిపారు. కోర్టుల్లో కేసుల పెండింగ్ తగ్గించేందుకు సెలవులు కుదించాలన్న అంశంపై ఎలడబ్ల్యూఏఎస్ఐఏ సమావేశంలో జస్టిస్ సింగ్ ప్రసంగించారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడంలో న్యాయమూర్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
 
"భారత్‌లో జడ్జిలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ పనిచేసి ఆ తర్వాత గోల్ఫ్ ఆడుకోడానికి వెళతారన్న భావన ఉంది. కోర్టుకు వచ్చే ముందు రెండు గంటల పాటు మేము పనిచేస్తాం. ఆ తర్వాత సాయంత్రం 4.30 వరకూ కోర్టులోనే ఉంటాం. అనంతరం మరో గంట కోర్టు కార్యకలాపాలను పరిశీలించి ఆ తర్వాత తీర్పులను ఖరారు చేసి మరుసటి రోజు బ్రీప్స్‌ను చదువుతాం. వాస్తవానికి భారతీయ జడ్జీలు రోజుకు 14-15 గంటలు పనిచేస్తారు. వ్యక్తిగత జీవితం - వృత్తిజీవితం మధ్య సమతౌల్యం సాధించడం మాకు కష్టంగా ఉంటోంది" అని ఆమె పేర్కొన్నారు.
 
ఈ పనిభారం తాలూకూ ప్రభావం న్యాయమూర్తుల కుటుంబాలపై కూడా పడుతోందని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. కాగా, చర్చలో పాల్గొన్న ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్ న్యాయమూర్తులు కూడా జస్టిస్ సింగ్ అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ పరిస్థితి న్యాయమూర్తులకు ఓ సవాలుగా మారిందన్నారు. వివిధ దేశాల న్యాయమూర్తులు హాజరైన ఈ సమావేశంలో కోర్టులకు సంబంధించి పలు ఇతర అంశాలపై కూడా చర్చించారు.