శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (18:07 IST)

తరగతి గదిలో గొడవపడిన ముస్లిం విద్యార్థులు.. పాకిస్థాన్ వెళ్లాలంటూ టీచర్ ఆగ్రహం

students
కొందరు ఉపాధ్యాయులు రాజకీయ నేతల తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తరగతిలో కొందరు విద్యార్థులు గొడవపడ్డారు. దీంతో వారిని పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ క్లాస్ టీచర్ హెచ్చరించి, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శివమొగ్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మంజులా దేవి అనే మహిళ టీచరుగా పని చేస్తున్నారు. అయితే, తన తరగతి గదిలో ఇద్దరు ముస్లిం విద్యార్థులు గొడవ పడుతుండగా, మంజులాదేవి వారిని ఉద్దేశించి పాకిస్థాన్ వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అని అన్నట్టుగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. 
 
టీచర్ చేసిన వ్యాఖ్యలను ఆ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీచర్‌పై మండిపడ్డారు. ఇదే విషయంపై వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు.. మంజులాదేవిని బదిలీ చేశారు. ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు సైతం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.