బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (14:14 IST)

బెంగుళూరు రామేశ్వరం కెఫే పేలుడు కేసు.. వ్యక్తి అరెస్టు

rameswaram cafe
ఇటీవల బెంగుళూరు నగరంలోని రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటన జరగ్గా, ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కీలక నిందితుడిని అదుపులోకి తీసుకుంది. బుధవారం కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్.ఐ.ఏ వెల్లడించింది. ఈ వ్యక్తిని షబ్బీర్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అయితే, ఈ అరెస్టుపై ఎన్.ఐ.ఏ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి షబ్బీర్ సహకరించినట్టు తెలుస్తుంది. 
 
కాగా, ఈ నెల ఒకటో తేదీన బెంగుళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసు కర్నాటక హోం శాఖ ఎన్.ఐ.ఏకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్.ఐ.ఏ.. బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కెఫేతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించింది.
 
పైగా, నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నగదు కూడా అందజేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బళ్లారిలో ఓ నిందితుడుని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్‌ ఉపయోగించినట్టు బాంబు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోని బళ్లారిలో తొలి నిందితుడిని అరెస్టు చేసింది.