నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చివేస్తాం : ఖలీస్థాన్ టెర్రరిస్టుల హెచ్చరిక
ఖలీస్తానీ వేర్పాటువాది హర్దీబ్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చి వేస్తామని ఖలీస్తానీ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన టెర్రరిస్ట్ గురుప్రత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీచేశాడు. ఈ మేరకు రికార్డు చేసిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
ఈ వీడియోలో భారత్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు హెచ్చరిక జారీచేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్ ఫర్ జస్టిస్ గ్రూపు నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబరు 5వ తేదీన ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. నిజ్జర్ హత్యపై మేం మీ బుల్లెట్‌కు వ్యతిరేకంగా మా బ్యాలెట్‌ను ఉపయోగించబోతున్నామని, తాము మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నామని చెప్పాడు. ఈ అక్టోబరు 5వ తేదీన జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్ నాంది నాంది అన్నాడు. ఈ సందేశం గురుప్రత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్లో ఉంది.
అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్‌తు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.