సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (12:35 IST)

జిమ్‌లో మహిళతో పరిచయం.. ఆపై సన్నిహితంగా మెలిగి వీడియోలు తీసి..

harassment
ముంబైలోని జిమ్‌లో పరిచయమైన ఓ మహిళను లైంగికంగా వేధించిన ట్రైనర్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వీడియో కాల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పెడతానని అతడు బెదిరింపులకు దిగాడు. దీంతో పరువుపోతుందనే భయంతో తొలుత నిందితుడికి కొంత మొత్తం చెల్లించిన బాధితురాలు.. మరిన్ని డబ్బులు కావాలని వేధిస్తుండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దక్షిణ ముంబై ప్రాంతంలో నిందితుడు జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అదే జిమ్‌కు వెళ్లిన బాధిత మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా ఫోనులో మాట్లాడుతూ.. బాగా దగ్గరైన తర్వాత వీడియో కాల్స్ చేసేవాడు. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని వేధింపులకు గురిచేసేవాడు.
 
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని భావించి తొలుత రూ.70 వేలు చెల్లించింది. మరిన్ని డబ్బులు కావాలని వేధిస్తుండటంతో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. పైగా శారీరకంగానూ తనతో కలవాలని అతడు వేధిస్తుండటంతో ధైర్యం చేసి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శనివారం రాత్రి అరెస్టు చేశారు. ట్రైనర్ నెల రోజులుగా వేధిస్తున్నాడని, అతడి టార్చర్ భరించలేక మహిళ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి అరెస్టు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు.