గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

లోక్‌సభ స్పీకర్ ఎవరు? ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ!!

loksabha
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదేసమయంలో కొత్త సభను నడిపే సభాపతి ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఒక్కరి పేరును కూడా తెరపైకి తీసుకునిరాలేదు. అదేసమయంలో 234 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కూడా స్పీకర్ అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. దీంతో కొత్త స్పీకర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
మరోవైపు, కొనసాగుతుండగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. అంటే జూన్ 26వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ గురువారం ప్రకటించింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తాము మద్దతు ఇచ్చే సభ్యుడి పేరును సెక్రటరీ జనరల్‌కు రాతపూర్వకంగా తెలియజేయవచ్చునని స్పష్టం చేసింది.
 
కాగా లోక్‌సభ సమావేశాల్లో మొదటి రెండు రోజులను కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి కేటాయించనున్నారు. ఇక జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల నూతన మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మొదటి రెండు రోజులపాటు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం లేదా లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం స్పీకర్‌ను ఎన్నుకుంటారని వివరించారు.