ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (07:35 IST)

రైల్వే భూమిని కబ్జా చేసిన హనుమంతుడు.. నోటీసులు జారీ!

Hanuman
సాధారణంగా ప్రభుత్వ, పరాయి వ్యక్తుల భూములు, కంటికి కనిపించే ఖాళీ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తుంటారు. కానీ, ఇక్కడ రైల్వే స్థలాన్ని హనుమంత దేవుడు కబ్జా చేశాడు. అమ్మతోడు ఇది నిజం. ఆంజనేయ దేవుడు రైల్వే భూమిని ఆక్రమించారని, అందువల్ల ఆయన తక్షణం ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసులు మరీ జారీచేశారు. ఈ విచిత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో కొత్త రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. గ్వాలియర్ - షియోపూర్ మధ్య ఏర్పాటు చేసే ఈ రైల్వే లైను నిర్మాణం కోసం స్థానికంగా ఉండే హనుమంతుడి ఆలయం అడ్డంగా వచ్చింది. దీంతో అధికారులు ఏమాత్రం వెనుకాముందు ఆలోచన చేయకుండా దేవుడు పేరిట నోటీసులు జారీచేశారు. 
 
కొత్తగా రైల్వే లైన్ వేస్తున్నాం కాబట్టి.. తక్షణం అక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ ఆంజనేయుడికి నోటీసులు పంపించారు. రైల్వే భూమిని హనుమంతుడు ఆక్రమించినట్టు పేర్కొన్నారు. ఈ నోటీసులను ఈ నెల 8వ తేదీన ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జారీ చేశారు. 
 
ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మేల్కొన్న అధికారులు.. ఆలయ యజమానికి నోటీసులు ఇవ్వాలని, కానీ పొరపాటున జరిగినట్టు ఝాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ మాథూరు వెల్లడించారు.