మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (16:14 IST)

దేశంలో డెల్టా ప్లస్‌ కలవరం.. మాస్క్‌ పెట్టుకోకపోతే అంతే సంగతులు...

Delta Plus
కరోనా సెకండ్ వేవ్‌ కొంత తగ్గి సాధారణ జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. జనాలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే మరో కొత్త వేరియంట్ ముప్పు ముంచుకొస్తోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ మరింత శక్తివంతమైన ప్రభావంతో డెల్టా ప్లస్‌గా మారినట్టు ఇటీవలే ప్రకటించారు.

ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారుతోందని, దీని బారిన పడిన వారి పక్క నుండి, మాస్క్‌ పెట్టుకోకుండా వెళ్లినా మహమ్మారి బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 
దేశంలో డెల్టా ప్లస్‌ కలవరం మొదలైంది. ఇది మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల వెల్లడించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్‌ సోకుతుందని.. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం వంటి కొవిడ్‌ జాగ్రత్తలతోనే రక్షణ అని స్పష్టం చేశారు. 
 
డెల్టా ప్లస్‌ వేరియంట్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఈ కొత్త వేరియంట్‌ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, అయినప్పటికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమని గులేరియా స్పష్టం చేశారు.