1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (12:54 IST)

రావణకాష్టంలా మారిన మణిపూర్ - మహిళా మంత్రి ఇంటికి నిప్పు

manipur roits
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఆ రాష్ట్రం ఇపుడు రావణకాష్టంలా మారింది. దీంతో ఆందోళనకారులు ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించారు. అదేసమయంలో ఈ ఘర్షణలను అణిచివేసేందుకు సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వెస్ట్ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి నెమ్చా కిప్గెన్ బంగళాను లక్ష్యంగా చేసుకుని దండుగులు బుధవారం సాయంత్రం నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ సీనియర్ అధికారుల నేతృత్వంలోని భద్రతా బలగాలు హుటాహుటిన మంత్రి నివాసానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఇంటికి నిప్పు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల్లో కిప్గెన్ ఏకైక మహిళా మంత్రి. ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో కిప్గెన్ ఒకరు కావడం గమనార్హం.