మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (17:34 IST)

హిజ్రాగా మారిన భర్తను చూసి మూర్ఛపోయిన భార్య.... ఎక్కడ?

missing
తల్లిదండ్రులు చూపించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే, రెండేళ్ల తర్వాత అప్పుల బాధ ఎక్కువయ్యాయని చెప్పి ఇంటి నుంచి పారిపోయి, హిజ్రాగా మారిపోయాడు. చివరకు కన్నడ బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమై భార్య కంట కనిపించాడు. ఈ విచిత్ర ఘటన కర్నాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటకలోని రామనగరుకు చెందిన లక్ష్మణరావు స్థానికంగా ఒక కోడిమాంసం విక్రయించే దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రులు చూపించిన యువతిని గత 2015లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్లలోనే ఇద్దరు కుమారులకు తండ్రి అయ్యాడు. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ 2017లో లక్ష్మణరావు ఇల్లు వదిలి పరారయ్యాడు. తన భర్త ఎక్కడా కనిపించకపోవడంతో ఆ గృహిణి ఐజూరు ఠాణాలో ఫిర్యాదు చేసింది. భర్త ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రుల సహకారంతో ఆమె మనుగడ సాగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోకు సంబంధించిన వీడియోలను టీవీలో చూస్తున్న సమయంలో ఆ గృహిణికి ఒక వ్యక్తిని చూసి అనుమానం వచ్చింది. అందులో తన భర్త ఉన్నట్లు అనిపించింది. మరోసారి ఆ వీడియోలను తన చరవాణిలో శోధించి చూడగా.. తన భర్త రూపంలోనే హిజ్రా ఉన్నట్లు గుర్తించింది. 
 
ఈ విషయాన్ని ఐజూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి వారికి ఫిర్యాదు చేసింది. కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలో 'నీతు వనజాక్షి' అనే హిజ్రా పాల్గొంది. పోటీ నుంచి బయటకు వచ్చిన ఆమెకు మైసూరులో తృతీయ లింగ సముదాయానికి చెందిన ప్రతినిధులు స్వాగతం పలికారు. రష్మిక అనే హిజ్రా తీసిన రీల్స్ లోనూ లక్ష్మణన్‌ను పోలిన హిజ్రా ఉంది.
 
ఆ వీడియోను చూసిన ఐజూరు పోలీసులు రష్మికను సంప్రదించి, వీడియోలో కనిపించిన వ్యక్తి ఆచూకీ అడిగారు. ఆమె పేరు విజయలక్ష్మి అని రష్మిక తెలిపింది. చిరునామా, ఇతర వివరాలు తెలుసుకుని విజయలక్ష్మిని ఐజూరు ఠాణాకు తీసుకొచ్చాు. అక్కడ జరిపిన విచారణలో తాను లక్ష్మణరావును కాదని, విజయలక్ష్మిని అంటూ అతను వాదించాడు. 
 
అయితే, తన భర్త ఒంటిపై ఉన్న పుట్టుమచ్చల్ని, ఇతర చిహ్నాలను భార్య గుర్తు పట్టింది. చివరకు తాను లక్ష్మణరావునని, లింగ మార్పిడి చేయించుకున్నానని అంగీకరించాడు. భర్త ఆ మాటలు చెప్పడంతోనే ఆమె మూర్ఛపోయింది. భార్యా, బిడ్డలను వదిలి పెట్టి వెళ్లేందుకు మనసు ఎలా అంగీకరించిందని ప్రశ్నించగా తనకు కుటుంబంకంటే హిజ్రా జీవితమే బాగుందని చెప్పాడు. కనిపించకుండా పోయిన కేసు పరిష్కారం కావడంతో లక్ష్మణరావుతో ఒక పత్రాన్ని రాయించుకుని పోలీసులు పంపించారు. అతడి భార్యను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు.