మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జులై 2024 (16:21 IST)

ముస్లిం మహిళైతేనేం.. విడాకుల తర్వాత భరణం చెల్లించాల్సిందే

supreme court
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ కేసులో కీలకమైన తీర్పు వెలువరించింది. తన మాజీ భార్యకు రూ.10 వేల మధ్యంతర భరణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 
 
ఈ విచారణలో భాగంగా ముస్లిం మతానికి చెందిన మహిళ అయినా, భర్త నుంచి విడాకుల తర్వాత భరణం కోరవచ్చని వివరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. గృహిణులు వారి కుటుంబాల కోసం చేసే త్యాగాలను పురుషులు ఇప్పటికైనా గుర్తించాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 
ఓ మహిళకు భరణం ఇవ్వడం అనేది దానధర్మం వంటిది కాదని, భరణం అనేది వివాహిత మహిళ ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. 
 
ఇది మతపరమైన హద్దులకు అతీతమైనదని, ప్రతి వివాహిత మహిళకు ఆర్థిక భద్రత కలిగించాలన్న సూత్రం ఇందులో ఇమిడి ఉందని తెలిపింది. సీఆర్పీసీ సెక్షన్ 125 కేవలం వివాహిత మహిళలకే కాకుండా అందరు మహిళలకు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.