1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (17:26 IST)

నేషనల్ హెరాల్డ్ కేసు : సోనియా వద్ద ముగిసిన ఈడీ విచారణ

sonia gandhi
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడు దఫాలుగా జరిపిన విచారణ బుధవారంతో ముగిసింది. మొత్తం ఆమె 110 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. వీటన్నింటికీ ఆమె ఒకటే సమాధానం చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేక ప్రశ్నలకు తనకు తెలియదని ఆమె సమాధానం చెప్పినట్టు వినికిడి. 
 
ఈ కేసులో సోనియా వద్ద ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జపిన ఈడీ అధికారులు బుధవారం మరోమారు విచారణ జరిపారు. ఈ విచారణ మూడు గంటల పాటు సాగింది. బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించింది. కొత్తగా ఎలాంటి సమన్లు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారు.
 
సెంట్రల ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ చేరుకున్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ ఆమె వెంట వెళ్లారు. 11.15 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. కేసు విచారణ జరుపుతున్న కీలక అధికారి.. సోనియాను ప్రశ్నలు అడిగారు. మరో అధికారి ఆమె చెప్పిన సమాధానాలను రాసుకున్నారు.
 
మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం కోసం సోనియా ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3.30కి మరోసారి రావాలని అధికారులు తొలుత సమాచారం ఇచ్చారు. అయితే, విచారణ ముగిసిందని, ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయానికి రావాల్సిన పని లేదన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సోనియాకు చెప్పినట్లు సమాచారం. 
 
కాగా, సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.