మధురై పీఠాధిపతి నేనే.. వార్తల్లోకి మళ్లీ నిత్యానంద..!
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు. మధురై పీఠం విషయమై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మధురై పీఠంపై నిత్యానంద కన్నేయడం చర్చనీయాంశమవుతోంది. నిత్యానందస్వామి. ఓ వివాదాస్పద విచిత్ర స్వామి. చాలాకాలంగా వార్తలకు దూరంగా ఉన్న నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు.
మధురైలోని ప్రసిద్ధి చెందిన శైవమఠానికి 293వ ఆధీనంగా బాధ్యతలు స్వీకరించినట్టు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ప్రకటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. నిత్యానందపై ఆరోపణల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయారు. సొంతంగా కైలాస దేశం స్థాపించానని ప్రకటించుకున్నారు. అంతేకాదు ఆ దేశానికి ఓ కరెన్సీ, వీసా కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు హఠాత్తుగా మధురై పీఠం బాధ్యతలు తీసుకున్నట్టు ప్రకటించడం వివాదంగా మారింది. అయితే కైలాసదేశం నుంచే ఆన్‌లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించనున్నట్టు తెలిపారు. తన పేరును కూడ జగద్గురు మహాసన్నిధానం శ్రీలశ్రీభగవాన్ నిత్యానంద పరమశివజ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామిగా మార్చుకున్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు.
మధురై శైవమఠానికి కొన్ని దశాబ్దాలపాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారమే శివైక్యం పొందడంతో నిత్యానంద ఆ పీఠంపై తనను తాను అధిపతిగా ప్రకటించుకున్నారు. ఆయన పార్ధీవదేహాన్ని మహాసమాధి చేసిన తరువాత అదే మఠంలో 5 వందల కేజీలతో అరుణ గిరినాధర్ పాలరాతి శిల్పం ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు.