గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (20:01 IST)

భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. కానీ పిల్లలకు ఇవ్వలేరు : సుప్రీంకోర్టు

విడాకుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యకు విడాకులు ఇచ్చే భర్త.. పిల్లలకు ఇవ్వలేరని స్పష్టం చేసింది. అందువల్ల పిల్లల సంరక్షణకు కొంత మొత్తం సొమ్ము చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది 
 
తాజాగ వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 2019లో ముంబైకి చెందిన‌ ఓ ఆభ‌ర‌ణాల వ్యాపారి, ఆయ‌న భార్య ప‌ర‌స్ప‌ర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లు తల్లితోనే ఉండాల‌ని, వారి సంర‌క్ష‌ణ కోసం తండ్రి రూ.4 కోట్లు చెల్లించాల‌ని ఒప్పందం చేసుకున్నారు.
 
అయితే, 2019లోనే స‌ద‌రు వ్యాపారి త‌న భార్య‌కు రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు ఇవ్వ‌లేదు. దాంతో అత‌ని భార్య సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. మంగ‌ళ‌వారం జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసు విచార‌ణ జ‌రిపింది. 
 
పిల్ల‌ల సంర‌క్ష‌ణ కోసం త‌క్ష‌ణ‌మే రూ.4 కోట్లు చెల్లించాల‌ని వ్యాపారిని ఆదేశించింది. కరోనావల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వ‌డంతో తన క్లయింట్‌ రూ.4 కోట్ల పరిహారం చెల్లించలేక‌పోయాడ‌ని, ఇప్ప‌టికీ ప‌రిస్థితి స‌రిగా లేనందున మ‌రికొంత స‌మ‌యం ఇవ్వాల‌ని వ్యాపారి త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరాడు.
 
కానీ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం అందుకు నిరాక‌రించింది. కడుపున పుట్టిన పిల్లల సంరక్షణను తండ్రి చూసుకోవాల్సిందేనని, మైనర్‌ పిల్లల పోషణ నిమిత్తం ఒప్పందం మేరకు రూ.4 కోట్లు చెల్లించాల్సిందేనని స్ప‌ష్టంచేసింది. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య‌కు విడాకులు ఇవ్వ‌వ‌చ్చుగానీ, పిల్ల‌ల‌కు ఇవ్వ‌లేర‌ని వ్యాఖ్యానించింది. సెప్టెంబ‌ర్ 1న రూ.కోటి, అదే నెల‌ 30న మిగిలిన రూ.3 కోట్లు పిటిష‌న‌ర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. అనంత‌రం కక్షిదారులు పరస్పరం దాఖలు చేసుకున్న కేసులను న్యాయ‌స్థానం కొట్టివేసింది.