సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Updated : గురువారం, 29 జులై 2021 (20:05 IST)

జాగింగ్ చేస్తున్న జ‌డ్జిని ... ఆటోతో గుద్దించి హ‌త్య‌!

Judge
ఉద‌యాన్నే జాగింగ్ చేస్తున్న జ‌డ్జిని ... ఆటోతో గుద్దించి హ‌త్య చేయించిన ఉదంతమిది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. 
 
తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  
 
జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్‌ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన జాగింగ్‌ చేసుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆయనకు ఢీకొట్టి వేగంగా వెళ్లింది. 
 
తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయమూర్తి కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఓ జడ్జి అని త‌ర్వాత తేలింది. ఆయ‌న‌పై క‌క్ష‌తోనే ఆటో ఢీకొట్టార‌ని అనుమానిస్తున్నారు.