శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:15 IST)

లతా మంగేష్కర్ అసలు పేరు ఏంటో తెలుసా?

కరోనా, న్యుమోనియాతో బాధపడుతూ కన్నుమూసిన గానకోకిల లతా మంగేష్కర్ అసలు పేరు ఎంటో చాలా మందికి తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు ఆమె లతా మంగేష్కర్‌గానే సుపరిచితం. కానీ, ఆమెకు అసలు పేరు ఒకటివుంది. ఆ పేరుకు తగినట్టుగానే ఆమె మనసు కూడా బంగారం. అయితే, ఆమె అసలు పేరుతో కాకుండా, కొసరుపేరుతో ఆమె ఎందుకంత ఫేమస్ అయ్యారో తెలుసుకుందాం. 
 
లతా మంగేష్కర్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు హేమ. ఈ పేరుకు తగ్గట్టుగానే అమె మనసు కూడా బంగారమే. అయితే, ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ స్వయానా గాయకుడు కావడం, రంగస్థల నాటకరంగంలో ఉండటంతో "భవబంధన్" అనే నాటకాన్ని రచించారు. ఆ నాటకంలో ఒక పాత్ర పేరు 'లతిక'. ఆ పాత్ర ఎంతగానో ఆమెకు నచ్చడంతో అప్పటివరకు ఉన్న హేమగా ఉన్న తన పేరును లతగా మార్చుకున్నారు. 
 
పైగా, తమ కుమార్తెలో ఓ మంచి గాయని ఉన్నారనే విషయాన్ని తండ్రి స్వయంగా గుర్తించారు. కుటుంబంలో తొలి సంతానంగా జన్మించిన లతా మంగేష్కర్.. 1942లో తండ్రి మరణం చెందిన తర్వాత కుటుంబ బాధ్యతలను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. ఈమెకు మీనా, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. 
 
తొలుత కొంతమంది సంగీత దర్శకులు ఆమె గొంతు సరిగా లేదని తిరస్కరించారు. కానీ, 1949లో తొలిసారి "మహల్" అనే చిత్రంలో ఆయేగా ఆనేవాలా అనే పాటతో ఆమె గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆమె పాటలు ఎంత పాపులర్ అయ్యాయో, ఆమె గాత్రాన్ని ఎంత మంది ఇష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.