సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (15:12 IST)

డిన్నర్ బిల్లు చెల్లించి షాకైన ఎన్నారై..

సాంకేతికత, డిజిటల్ చెల్లింపులు ప్రజలలో ఎంతగా పురోగమిస్తున్నాయో తెలియడం లేదు గానీ మోసగాళ్లకు మాత్రం అవే పెద్ద ఆయుధంగా మారి అవతలి వారు ఎంతటి వారైనప్పటికీ క్షణాల్లో వారిని మోసం చేసేయడంలో బాగా సహకరిస్తోంది. 
 
వివరాలలోకి వెళ్తే... సాధారణంగా మోసపూరిత లావాదేవీలు అంటే ఎవరో ఫోన్ చేసి ఓటిపిలు అడుగుతారు, వాటి గురించి పెద్దగా అవగాహన లేని ఎవరైనా వాటిని అవతలి వ్యక్తికి అందజేస్తారు తద్వారా వారి ఖాతాలో నుండి డబ్బులు మాయం అవుతుంది అనుకుంటాము. కానీ యూకే నుండి వచ్చిన ఒక 56 ఏళ్ల ఎన్నారై కొన్ని నిమిషాల వ్యవధిలోనే 1.7 లక్షలు పోగొట్టుకొని బోరుమంటూ ఉండడం ఇక్కడ చర్చకి దారితీస్తోంది.
 
గతేడాది తాను బెంగళూరులో ఉంటున్నప్పుడు కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌ని విక్రయించేందుకు యూకే నుండి స్వదేశానికి వచ్చిన సునీల్ బ్రూత(56) అనే ఎన్నారై స్థానికంగా ఉన్న ఎంజీ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో గత శుక్రవారంనాడు భోజనం చేసి సదరు డిన్నర్ తాలుకు బిల్లు మొత్తం రూ. 4,027ని తన డెబిట్ కార్డుతో చెల్లించాడు. అంతే... డిన్నర్ బిల్లు చెల్లించిన నిమిషాల వ్యవధిలోనే సునీల్‌కు ఐదు లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు వచ్చేసాయి. 
 
ఈ మోసపూరిత లావాదేవీల వల్ల ఆయన అకౌంట్ నుండి సుమారు రూ. 1,71,332 డెబిట్ అయింది. దీంతో వెంటనే స్పందించిన సునీల్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి డిజిటల్ ఇండియా ఎవరికి ఉపకరిస్తోందో... ఏమిటో అధికారులే చూసుకోవలసినట్లు ఉంది.