శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:46 IST)

మానవాళికి శత్రువులు.. ఎన్ఎస్ఏ కింద కేసులు : సీఎం యోగి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకులైన తబ్లిగీ జమాత్ సంస్థకు చెందిన సభ్యులపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మానవాళికి శత్రువులు అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటివారిపై ఎన్.ఎస్.ఏ కింద కేసులు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. 
 
కాగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ సంస్థ మత సమ్మేళనాన్ని నిర్వహించింది. దీనికి దేశం నలుమూలల నుంచి వందలాది మంది హాజరయ్యారు. కరోనా బాధిత దేశాల నుంచి కూడా విదేశీ ప్రతినిధులు వందల సంఖ్యలో హాజరయ్యారు. 
 
వీరిలో కొందరు కరోనా బారినపడడంతో మరికొందరిని ముందు జాగ్రత్తగా అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో తబ్లిగీ సభ్యులు నర్సులు, ఇతర వైద్యసిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. 
 
వైద్యసిబ్బందిపై దాడి చేసినవాళ్లను "మానవాళికి శత్రువులు"గా అభివర్ణించారు. వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. "వారు చట్టాన్ని గౌరవించరు, ప్రభుత్వ ఆదేశాలను అంతకన్నా పాటించరు. ఇలాంటివాళ్లతో మనుషులకు ముప్పు ఉంటుంది. మహిళా వైద్య సిబ్బందిపై వారు దాడికి పాల్పడడం తీవ్ర నేరం. వారిని వదిలిపెట్టేది లేదు" అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.