శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (11:30 IST)

ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఉద్వాసన? సర్వేలో బీజేపీ బిజీ

కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. దీంతో ఆయన్ను సీఎం కుర్చీ నుంచి తప్పించాలా? వద్దా? అనే విషయంపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం అభిప్రాయ సేకరణలో నిమగ్నమైవుంది. 
 
దక్షిణాదిలో బీజీపీని అధికారంలోకి తెచ్చిన ఘనత యడ్యూరప్పకే దక్కుతుంది. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయనపై అనేక విమర్శలు వస్తున్నాయి. సీఎం యడియూరప్పపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
దీంతో ఈ దిశగా అధిష్టానం దృష్టిసారించింది. పైగా, అభిప్రాయ సేకరణకూ నడుంబిగించింది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రిపై అభిప్రాయ సేకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఇచ్చే నివేదిక అనంతరం ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
నిజానికి బీజేపీలో సంతకాల సేకరణ అనే సంప్రదాయం లేదు. అయితే, ముఖ్యమంత్రి యడ్డీకి వ్యతిరేకంగా కొందరు సంతకాల సేకరణ చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, యడియూరప్ప మద్దతుదారులు 65 మంది తమ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని కనుక నిర్వహిస్తే తమ అభిప్రాయాన్ని చెబుతామని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అది కూడా అధిష్ఠానం నుంచి వచ్చే నేత సమక్షంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
బీజేపీ చీఫ్ విప్ సునీల్ కుమార్ కూడా సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలంటూ ట్వీట్ చేయడం యడ్డీపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని చెబుతున్నారు. కాగా, పార్టీ బాధ్యుడు అరుణ్‌సింగ్ త్వరలోనే బెంగళూరు వచ్చి తాజా పరిణామాలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది.