అభినందన్ విడుదల నాకిష్టం లేదు : పాకిస్థాన్ రైల్వే మంత్రి
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయడాన్ని ఆ దేశ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభినందన్ విడుదల తనకు సుతరామా ఇష్టంలేదని తెగేసి చెప్పారు.
ఇదే అంశంపై ఆయన ఆ దేశ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉన్నట్టువంటి పరిస్థితులు ఇపుడు భారత్‌లో లేవన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మదిలోని ఆలోచనలు మరోలా ఉన్నాయన్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చన్నారు.
ప్రధానంగా కార్గిల్ యుద్ధ సమయంలో భారత్‌కు చెందిన ఒక్క జెట్ విమానం కూడా సరిహద్దు దాటలేదని గుర్తు చేశారు. కానీ, ఇపుడు ఏకంగా 14 జెట్ విమానాలు సరిహద్దును దాటాయని చెప్పారు.
పైగా, భారత్‌లో ఇది ఎన్నికల సమయం. అందుకే నరేంద్ర మోడీ దాడులు చేయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే గనుక నిజమైతే భారత పైలట్‌ను విడుదల చేసిన తర్వాత ప్రధాని మోడీ మరోసారి దాడి చేయరని నమ్మకం ఏముందని ప్రశ్నించారు.
ఒకవేళ రేపటి రోజున నరేంద్ర మోడీ దాడులు చేయిస్తే మన పరిస్థితి ఏంటి? భారత్‌లోని ప్రతీ ముస్లిం పాకిస్థాన్ గురించి ఆలోచిస్తున్నారు. యుద్ధ సమయంలో ఒక్క భారత జెట్ ఫైటర్ కూడా కార్గిల్ దాటలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 14 జెట్లు వచ్చాయంటూ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందించలేదు.