శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (10:20 IST)

'ధీరుడు' అభినందన్‌ విడుదలకు మూడు కారణాలివే...

తమ వద్ద బందీగా ఉన్న భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ విడుదల చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తాము శాంతి కాముకులమని, శాంతిని కోరుతున్నామని ప్రపంచదేశాలకు చెప్పేందుకే అభినందన్‌ను విడిచిపెడుతున్నామని ఇమ్రాన్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించారు. కానీ, ఆయన అలా ప్రకటన చేయడం వెనుక అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల నుంచి వచ్చిన ఒత్తిడే. ఫలితంగా పాకిస్థాన్ ఆర్మీ అభిమతానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 
అభినందన్ విడుదలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు అత్యంత కీలకంగా వ్యవహరించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ అభినందన్ విడుదలపై ఒక ప్రకటన చేయకముందే... హనోయ్‌లో డోనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్‌ల నుంచి శుభవార్తను విననున్నామని స్వయంగా చెప్పారు. ఆ వెంటనే అభినందన్ విడుదలపై పాక్ ప్రకటన చేస్తుందని పలువురు అంచనా వేశారు. 
 
ఇదేసమయంలో యూఎస్ రక్షణ మంత్రి మైక్ పాంపేయ్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో ఫోన్ లో 25 నిమిషాల పాటు మాట్లాడారు. అలాగే, భారత్‌కు అత్యంత నమ్మకమైన దేశాల్లో ఒకటిగా ఉన్న యూఏఈ కూడా పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇటీవల ఆ దేశంలో పర్యటించిన సౌదీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్, వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించారు. ఇక భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం సంభవిస్తే, ఈ పెట్టుబడులను పెట్టలేమని తెగేసి చెప్పారు. ఇదే జరిగితే ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోవడం ఖాయమని ఇమ్రాన్ భావించారు. దీంతో యూఏఈ ఒత్తిడి ఆయన తలొగ్గారు. 
 
ఇక చివరగా, పాకిస్థాన్‌కు అత్యంత ఆప్త దేశం చైనా. ఇక్కడ చైనా చేతులెత్తేసింది. భారత్‌కు అండగా నిలబడింది. చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్... తాను చేసిన ప్రసంగంతో చైనాను ఆకట్టుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్‌పై సానుకూల ధోరణితో ఉండే చైనా మనసు మార్చుకుంది. ఈ దశలో పాకిస్థాన్‌కు సాయపడలేమని తేల్చి చెప్పింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఇక చేసేదేమీ లేక ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలోనే అభినందన్ విడుదల ప్రకటన చేశారు. ఇలాంటి క్లిష్టతరుణంలో భారత ప్రదర్శించిన దౌత్యనీతికి ప్రపంచ దేశాలు సైతం అండగా నిలబడగా, పాకిస్థాన్ ఏకాకి అయింది. ఫలితంగా ధీరుడు అభినందన్ వర్ధమాన్ సగర్వంగా స్వదేశంలో అడుగుపెడుతున్నాడు.