సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (22:15 IST)

ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడు కరుణానిధి : పవన్ కళ్యాణ్

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి దక్షిణ భారతానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. కరుణానిధి మృతి

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి దక్షిణ భారతానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. కరుణానిధి మృతిపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 
'కరుణను ద్రవిడ ఉద్యమ తపో పుత్రుడంటూ సంబోధించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రచయితగా, సంస్కృతి పరిరక్షకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా కరుణానిధి వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరానికి, భావి తరాలకు చిరస్మరణీయాలు' అని పవన్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా కరుణానిధి మృతిపట్ల సంతాపం తెలిపింది. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆవేదన వ్యక్తంచేశారు. డీఎంకే కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నామని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కరుణానిధిలేని లోటు భర్తీ కాదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని సూర్జేవాలా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఇకపోతే, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ, కరుణానిధి గొప్ప నేత అని, అణగారిన వర్గాల కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. కరుణానిధి మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. 
 
కరుణానిధి పరిణతి చెందిన నేత అని, రాజనీతిజ్ఞుడని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
 
కాగా, కరుణానిధి మృతి తమిళనాడుకే కాకుండా దేశానికి తీరని లోటని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఒక గొప్పనేతను కోల్పోయామని, జాతీయ రాజకీయాల్లో కరుణ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.