శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (13:28 IST)

పాల ప్యాకెట్ కోసం వెళ్తే పోలీసులు కొట్టి చంపేసారు.. ఎక్కడ?

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితులలో, నిత్యావసర సరకుల కోసం ప్రజలు బయటకి రావొచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం రోడ్డుపై కనిపించిన వారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో లాఠీ దెబ్బకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ లోని హౌరా కి చెందిన లాల్ స్వామి అనే ఓ 32ఏళ్ళ వ్యక్తి పాలు కోసమని బయటకి రాగానే పోలీసులు అతన్ని ఆపి తీవ్రంగా కొట్టగా... అతడు అక్కడిక్కడకే కుప్పకూలాడు. దాంతో అతనితో పాటు వచ్చిన భార్య కేకలు వేయగా కొంతమంది అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఆయన మార్గ మధ్యంలోనే మరణించాడని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులపై ఆందోళనకు దిగారు. మృతుడి భార్య పోలీసులు కొట్టడం వల్లనే తన భర్త చనిపోయాడని ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు మాత్రం అతనికి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడని చెబుతున్నారు. 
 
అయితే మృతుడికి హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య పరీక్షలలో తేలింది. ఏది ఏమైనా నిత్యావసర సరకులు కొనుక్కునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఎలా 21 రోజుల పాటు జీవించాలని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధం చేసుకోలేని పోలీసులు చచ్చేటట్టు లాఠీ ఛార్జ్ చేయడం ప్రస్తుతం అందరి ఆగ్రహానికి కారణమవుతుంది.