స్వదేశానికి వచ్చిన ప్రజ్వల్... ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసిన పోలీసులు
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్థరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాకమునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రావడంలో తాత్సారం చేశారు.
చివరకు మాజీ ప్రధాని దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్‌కు వచ్చి దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాలని హెచ్చరించారు. దీంతో, ప్రజ్వల్ దిగొచ్చాడు. మరోవైపు, ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఇక హసన్‌లో ఉన్న ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు.
ఇదిలావుంటే, తాత వార్నింగ్ అనంతరం ప్రజ్వల్ సోమవారం తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వారికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలతో తాను డిప్రెషన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. మే 31న పోలీసుల ముందు హాజరవుతానని, దర్యాప్తునకు సహకరిస్తానని అన్నాడు. తనకు దేవుడి ఆశీర్వాదం ఉందని చెప్పుకొచ్చాడు.