ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (11:02 IST)

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

non veg meals
ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వంట చేసుకునే తీరికలేని వారికి ఫుడ్‌ డెలివరీ యాప్‌లు చక్కటి పరిష్కారం అందిస్తున్నాయి. అయితే, ఫుడ్ ఆర్డర్లు పెరిగేకొద్దీ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. డెలివరీ జాప్యం, ఆర్డర్ చేసిన ఐటెమ్‌లలో కొన్ని రాకపోవడం లేదా ఒక ఆర్డర్‌కు బదులు మరో ఆర్డర్ రావడం వంటివి జరగడం కామన్‌గా మారిపోయాయి. 
 
బెంగుళూరులో ఓ గర్భిణీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. శాఖాహారి అయిన ఆమె జొమాటోలో పన్నీర్ థాలీ కోసం ఆర్డర్ పెట్టగా ఆర్డర్‌ తెచ్చిన వ్యక్తి పొరపాటున చికెన్ థాలీ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనిపై ఆమె భర్త ఎక్స్ వేదికగా జొమాటో తీరును తప్పుబట్టారు. 
 
ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలంటూ జొమాటోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. శాఖాహారులు మాంసాహారం ఎలా తినగలరని ప్రశ్నించాడు. అందులోనూ ఒక గర్భిణీ ఎలా తినగలదని, ఒక వేళ ఆమెకు ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని నిలదీశాడు. 
 
దీనిపై జొమాటో స్పందించింది. ఫోనులో సంప్రదించడం ద్వారా ఇందుకుగాను తమ వైపు నుంచి ఉత్తమ పరిష్కారాన్ని కస్టమర్‌కు అందించినట్టు తెలిపింది. అయితే, ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రెస్టారెంట్‌ నిర్వాహకులు పొరపాటు చేస్తే దానికి జొమాటో యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.