చెరకు తోటలో దాగిన పూణె లైంగికదాడి కేసు నిందితుడు అరెస్టు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణె లైంగికదాడి కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్‌లో ఒకటైన స్వర్‌గేట్ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం బస్సు కోసం వేచి చూస్తున్న 26 యేళ్ల యువతితో అక్కా అని మాటలు కలిపిన నిందితుడు, ఆపై ఆమె వేచి చూస్తున్న బస్సు మరో ప్రాంతంలో ఉందని నమ్మించి బస్టాండ్ చివరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆగివున్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయంగానూ దుమారం రేపింది. నిందితుడుని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బస్టాండులోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడుని 36 యేళ్ల దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ఎనిమిది పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, నిందితుడు చెరకు తోటల్లో దాగడంతో డ్రోన్ల సాయంతో గుర్తించి అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమలో శిరూర్ తహసీన్‌లోని ఓ గ్రామంలో దాక్కున్న నిందితుడుని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.