అదానీ - అంబానీల ఇళ్లకు సీబీఐ - ఈడీలను పంపించండి : ప్రధాని మోడీకి రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సూచన చేశారు. 'గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలి. అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?' అంటూ బుధవారం తెలంగాణలోని వేములవాడ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. అంబానీ, అదానీలు డబ్బు పంపుతున్నారంటూ వ్యక్తిగత అనుభవం దృష్ట్యా మాట్లాడుతున్నారా? అని మోడీని రాహుల్ సూటిగా ప్రశ్నించారు.
"మోడీ గారూ.. మీరు భయపడుతున్నారా? సాధారణంగా అయితే మీరు అదానీ, అంబానీల గురించి డోర్లు మూసి ఉన్నప్పుడే మాట్లాడుతారు. కానీ మొదటిసారి మీరు అదానీ, అంబానీ గురించి బహిరంగంగా మాట్లాడారు అంటూ 46 సెకన్ల నిడివిగల వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఆ ఇద్దరు వ్యాపారవేత్తలకు మీరు ఇచ్చిన డబ్బుకు అంతే మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన పథకాల ద్వారా ఆ దేశ ప్రజలకు పంపిణీ చేస్తుంది. బీజేపీ అవినీతికి డ్రైవర్, సహాయకులు ఎవరో దేశానికి తెలుసు. వాళ్లు డబ్బులు ఇస్తారని మీకు కూడా తెలుసా. అది మీ వ్యక్తిగత అనుభవమా?" అని రాహుల్ ప్రశ్నించారు.
"ఒక పని చేయండి.. సీబీఐ, ఈడీలను వారి వద్దకు పంపి సమగ్ర విచారణ జరిపించండి. భయపడకండి" అని కాంగ్రెస్ అగ్రనేత ఎద్దేవా చేశారు. కాగా తెలంగాణలోని వేములవాడలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు అంబానీ - అదానీల పేర్లు ఎత్తడం లేదని, ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి అందరూ మాట్లాడడం మానేశారని, వారి నుంచి డబ్బు ముట్టిందా అని ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.