గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (13:41 IST)

అస్సాంలో రాహుల్ గాంధీకి ఆలయ ప్రవేశం నిరాకరణ - రోడ్డుపై బైఠాయింపు

rahul gandhi agitation
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. అస్సాంలో ఆయనకు ఆలయ ప్రవేశం నిరాకరించారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. ఆలయం ప్రవేశం చేయకూడనంత నేరం తాను ఏం చేశానని ఆయన ఆలయ సిబ్బందిని నిలదీశారు. 
 
తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా, రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్‌ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. 
 
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయిస్తున్నారని విమర్శలు చేశారు. 
 
'మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేమీ చేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదు' అని రాహుల్ మీడియాతో మాట్లాడారు. 
 
కాగా, తన యాత్ర మార్గంపై ఒకసారి పునరాలోచించుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదవారం రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యం ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ అభ్యర్థన చేశారు. 
 
అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్‌ యాత్ర కొనసాగనుంది. బతద్రవ సత్ర.. శ్రీమంత శంకరదేవ జన్మస్థలం. ఆయన 15వ శతాబ్దానికి చెందిన సాధువు. ఈ ఆలయ సందర్శనకు వెళ్లాలని భావించగా, ఆలయ సిబ్బంది నిరాకరించారు.