సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నేడు జరిగేది బాల రాముడి ప్రతిష్ట మాత్రమే... ఆలయ చైర్మన్ నృపేన్ మిశ్రా

Ayodhya Ram Mandir
అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తికాకముందే ప్రాణప్రతిష్ట చేయడాన్ని, గర్భగుడిలో ప్రధాని నరేంద్ర మోడీని అనుమతించి, తమకు మాత్రం వెలుపల ఆసనాలు ఏర్పాటు చేయడాన్ని నలుగురు శంకరాచార్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేన్ మిశ్రా స్పందించారు. వారు సనాతన ధర్మాచరణ పర్యవేక్షకులన్నారు. 
 
'వారు ధర్మగురువులు. నేను సామాన్యుడిని.. అయితే జాతికి నేనో విషయం చెప్పదలిచాను. ఆలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌ భూతలంలో బాలరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నామని ప్రకటించాం. ఇందులో గర్భ గుడి, ఐదు మండపాలుంటాయి. దీనివరకు నిర్మాణ పూర్తయింది. మొదటి అంతస్థు ఇంకా పూర్తి కావలసి ఉంది. అందులో రామ్‌దర్బార్‌ ఉంటుంది. రాజారాముడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా దర్శనమిస్తాడు. రెండో అంతస్థులో ధ్యానం, ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి' అని వివరించారు. 
 
మొత్తం ఆలయం ఈ యేడాది చివరికల్లా పూర్తవుతుందన్నారు. ఇదిలావుంటే, రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాబోమన్న నలుగురు శంకరాచార్యలను, ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆధ్యాత్మికవేత్త జగద్గురు స్వామి రామభద్రాచార్య మహరాజ్‌ 'వినాశకాలే విపరీత బుద్ధి' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అహం వీడి వేడుకలకు హాజరు కావాలని హితవు పలికారు. 
 
22న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట.. పలు రాష్ట్రాల్లో సెలవుతో పాటు డ్రై డే 
 
అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు రాష్ట్రాలు ఒక రోజు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు అర పూట సెలవు ప్రకటించాయి. అలాగే, అనేక రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాయి. అయితే, ఏయే రాష్టరాల్లో పూర్తిగా సెలవులు ఉన్నాయి.. ఆ వివరాలేంటో పరిశీలిస్తే, 
 
జనవరి 22వ తేదీన పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేవలం సెలవు మాత్రమే కాకుండా డ్రై డేగా ప్రకటించాయి. ఈ పవిత్రోత్సవం రోజున మద్యం లేదా మాంసాహారం అందించే దుకాణాలు మూసివేయాలని ఆదేశించాయి. అలాగే, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాలు డ్రైడేగా ప్రకటించాయి. 
 
ఇంకోవైపు, జనవరి 22వ తేదీన అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు అరపూట సెలవు ప్రకటించాయి. ఉద్యోగులకు వేడుకల్లో పాల్గొనేలా చేయడానికి ఈ మేరకు నిర్ణయించారు. అయితే, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ జనవరి 22వ తేదీన హాఫ్‌డే సెలవు ప్రకటించి, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇంకోవైపు, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు అరపూట సెలవు ప్రకటించాయి.