బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (15:09 IST)

రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర.. జనవరి 14న ప్రారంభం

Rahul Gandhi
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. తాజా రెండో దశలో 'భారత్ న్యాయ యాత్ర' పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగుస్తుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి భారత్ న్యాయ యాత్రను ప్రారంభించనున్నారు. బస్సు, కాలినడకన రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు.
 
కాగా, గత ఏడాది రాహుల్ 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్ర 2022 సెప్టెంబర్ 7న ప్రారంభమై ఈ ఏడాది జనవరి 30న ముగిసింది. రాహుల్ దాదాపు 12 రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సుదీర్ఘ ప్రయాణం 145 రోజులు (దాదాపు 5 నెలలు) మరియు సుమారు 3970 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
 
ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్రలో తనకు ఎదురైన అనుభవాలతో రెండోసారి పాదయాత్ర ప్రారంభిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. ఈసారి యువత, మహిళలు సహా అన్ని వర్గాలతో మాట్లాడతానని, మొత్తం 6,200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా యాత్ర సాగుతుంది.