సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:50 IST)

భార్య ముసుగు వేసుకోలేదనీ.. కాళ్లు పట్టుకుని కన్నబిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి

భార్యాభర్తల మధ్య గొడవ ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. భార్య ముసుగు ధరించలేదన్న కోపంతో మూడేళ్ల కన్నబిడ్డ కాళ్లు పట్టుకుని కసాయి తండ్రి నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ప్రదీప్ యాదవ్ అనే వ్యక్తితో మోనికా అనే యువతికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి మూడేళ్ల పాప ఉంది. పెళ్లి అయిన నాటి నుంచి ఆచారాల పేరిట ఆమెను ప్రదీప్ మానసికంగా వేధిస్తూ వచ్చాడు. ముఖానికి ముసుగు ధరించాలంటూ పదే పదే ఇబ్బంది పెట్టేవాడు. కానీ, భార్య మాత్ర భర్త మాటను పెడచెవిన పెట్టేది. 
 
ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం కూడా భార్యాభర్తల మధ్య ముసుగు విషయంలో గొడవ జరిగింది. ఆమె ముసుగు వేసుకోననేసరికి కోపంతో ఊగిపోయిన ప్రదీప్.. ఆమెపై చేయి చేసుకున్నాడు. తర్వాత ఆ కోపాన్ని కూతురిపై చూపుతూ, చిన్నారిని కొట్టాడు. భార్య చేతిలో ఉన్న పాపను లాక్కుని బయటకు విసిరేశాడు. 
 
దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలై మరణించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన కుటుంబంతో కలిసి ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రదీప్ ఖననం చేశాడు. బుధవారం జరిగిన ఘటనపై బెహ్రార్ పోలీసులకు మోనిక ఫిర్యాదు చేసింది. కాగా ప్రస్తుతం నిందితుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడు.