1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (12:12 IST)

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు .. ఆర్ఎంఎం కూడా రద్దు చేస్తున్నా.. రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. తాను భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లోకి రాలేనని స్పష్టంచేశారు. పైగా, ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చిన 'రజినీ మక్కల్‌ మండ్రం'ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఇకపై రజనీకాంత్ అభిమానుల సంక్షేమ సంఘంగా కొనసాగనుంది. 
 
తన రాజకీయ భవిష్యత్‌పై మరోమారు స్పష్టం చేసేందుకు రజనీకాంత్ సోమవారం ఆర్ఎంఎం నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై అందరిలో ఓ ఉత్కంఠత నెలకొంది. రజినీకాంత్‌ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ రజినీకాంత్‌ సమావేశం అనంతరం ఓ క్లారిటీ ఇస్తూ ఓ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు. రజినీ మక్కల్‌ మండ్రంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
"రజిని మక్కళ్‌ మండ్రం నిర్వాహకులకు, సభ్యులకు, నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు నా నమస్కారం. నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ప్రకటించిన తర్వాత, రజనీ మక్కళ్‌ మండ్రం పని ఏంటి? పరిస్థితి ఏంటి? అని ప్రజలు, మక్కళ్‌ మండ్రం నిర్వాహకులు, అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను రాజకీయ పార్టీని ప్రారంభించి, అందులో పనిచేయడానికి తగ్గట్టుగా రజనీకాంత్‌ రసిగర్‌ నర్పణి మండ్రాన్ని... రజనీకాంత్‌ మక్కళ్‌ మండ్రంగా మార్చాను. 
 
రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాల స్థాయిలోనూ  పలు పదవులను, పలు అనుబంధ బృందాలను ఏర్పాటు చేశాం. కానీ కాలం కలిసిరాకపోవడంతో మనం అనుకున్నది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన నాకు లేదు. అందుకే, రజనీ మక్కళ్‌ మండ్రాన్ని రద్దు చేస్తున్నాను. అనుబంధ బృందాలు కూడా ఇక ఏవీ ఉండవు. ఇప్పుడు రజనీ మక్కళ్‌ మండ్రంలో ఉన్న కార్యదర్శులు, అడిషనల్‌, జాయింట్‌ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులతో ప్రజల సంక్షేమం కోసం.. ఇంతకు ముందు ఉన్నట్టే రజనీకాంత్‌ రసిగర్‌ నర్పణి మండ్రం (రజనీకాంత్ అబిమానుల సంక్షేమ సంఘం) పని చేస్తుంది" అని రజనీకాంత్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.