మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (11:18 IST)

ప్రియుడుని పైలట్ చేసేందుకు సొంతింటికి కన్నం వేసిన ప్రియురాలు

తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడుని పైలట్ చేసేందుకు ఓ ప్రియురాలు ఏకంగా సొంతింటికే కన్నంవేసింది. చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయి, అసలు విషయం వెల్లడించడంతో ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని భక్తినగర్‌కు చెందిన ప్రియాంక (20), హెట్‌ షా (20) అనే యువతీ యువకుల మధ్య ట్యూషన్‌ క్లాస్‌‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. అపుడు వీరిద్దరూ ఛార్టెడ్‌ అకౌంటెంట్లు కావాలన్నదే ధ్యేయంగా పెట్టుకున్నారు. 
 
కానీ, హెట్ షా మాత్రం తన మనసును మార్చుకుని కమర్షియల్ పైలెట్ అవ్వాలని భావించాడు. ఈ విషయం తన ప్రియురాలికి చెప్పాడు. అందుకు ట్రైనింగ్ ఇచ్చే శిక్షణా కేంద్రం బెంగుళూరులో ఉందని తెలుసుకున్నారు. అయితే, అందులో చేరేందుకు భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలన్న అంశంపై వారిద్దరూ మల్లగుల్లాలు పడ్డారు. 
 
కానీ, ప్రియుడు కోరికను తీర్చేందుకు ప్రియాంక తన సొంతింటికే కన్నం వేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అంతే.. ప్రియుడుకి సాయం చేసేందుకు 3 కిలోల బంగారు నగలు, 2 కిలోల వెండి నగలు, రూ.64,000 నగదును కప్‌బోర్డులోంచి దొంగిలించింది. వీటి మొత్తం విలువ రూ.కోటికి పైగా ఉంటుంది. ఎవరికీ అనుమానంరాకుండా ఉండేలా ఇంట్లో దోపిడీ జరిగినట్టు వస్తువులన్నీ పగులగొట్టింది. 
 
ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందంటూ తన తల్లిదండ్రులను నమ్మించింది. దీంతో వ్యాపారవేత్త అయిన ప్రియాంకా తండ్రి కిషోర్‌ పర్సన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో భాగంగా పోలీసులు దోపిడీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంట్లో దోపిడీ జరగలేదనీ నకిలీ తాళం ఉపయోగించి నగలు చోరీ చేసినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 
 
దీంతో ప్రియాంకను ప్రశ్నిస్తే తనకేం తెలియదని చెప్పింది. దీంతో ఆమె గతం తవ్వడం మొదలు పెట్టారు. ప్రేమలో ఉన్న సంగతి గమనించి హెట్‌ షా వివరాలు సేకరించారు. అతను బెంగుళూరులో ఉన్నట్టు గుర్తించి, అక్కడకు వెళ్లి విచారించారు. ఈ విచారణలో నిజం తెలిసింది. కూతురే ఇదంతా చేయడంతో ఆ తల్లిదండ్రుల మనసు విలవిల్లాడింది. చేసేదేమీ లేక ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. 
 
దాదాపు 17 రోజుల తర్వాత మిస్టరీ వీడింది. ప్రియాంక శ్రీమంతుల బిడ్డ కాగా హెట్‌ తండ్రి ఓ సిరామిక్‌ తయారీ సంస్థలో చిన్న ఉద్యోగి. ఇంతకీ హెట్‌ శిక్షణకు కావాల్సిన రుసుం రూ.20 లక్షలు. ఈ మొత్తం చెల్లించేందుకు ప్రియాంకా సొంతింటికి కన్నం వేసినట్టు పోలీసులకు చెప్పింది.