శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (13:50 IST)

ఉత్తరప్రదేశ్‌లో స్వీప్ చేస్తాం : రాజ్‌నాథ్ సింగ్ జోస్యం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 స్థానాల్లో 72 సీట్లలో విజయం సాధిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 72 సీట్లలో గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ దఫా కూడా ఈ సీట్లను తిరిగి దక్కించుకుంటామని తెలిపారు.
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్నామొన్నటివరకు బద్ధశత్రువులుగా ఉన్న సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు పొత్తుపెట్టుకున్న విషయంతెల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుంది. దీంతో ఈ దఫా త్రిముఖ పోటీ నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, గత ఎన్నికల్లో గెలుచుకున్న 72 స్థానాలను వచ్చే ఎన్నికల్లోనూ దక్కించుకుంటామని తెలిపారు. 
 
కాగా, ఈ రాష్ట్రంలో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 71 స్ధానాలు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు సీట్లు గెలవగా సమాజ్‌వాదీ పార్టీ 5, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకోగా, బీఎస్‌పీ ఒక్క స్థానంలో కూడా గెలుచుకోలేకపోయింది. 
 
యూపీలో బీజేపీ హావాకు అడ్డుకట్ట వేసేందుకు దశాబ్దాల తరబడి బధ్ధశత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు తమ మధ్య వైరాన్ని పక్కన పెట్టి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చెరి 38 స్ధానాల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. మిగిలిన నాలుగు స్ధానాల్లో రాయబరేలి, అమేథీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగా మిగిలిన రెండింటిలో ఆర్ఎల్టీ వంటి పార్టీలకు ఇవ్వాలని అనుకున్నారు.