అత్యంత విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

lalu prasad yadav
ఠాగూర్| Last Updated: ఆదివారం, 24 జనవరి 2021 (10:24 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఈయన ప్రస్తుతం గడ్డి కుంభకోణంలో ముద్దాయిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ఆరోగ్యం మరింత విషమమైందని న్యూఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

దీంతో బీహార్‌లో ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాంచీ ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, న్యూఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైద్య వర్గాలు తెలిపాయి.

జైలుకు వెళ్లక ముందు నుంచి ఆయన కిడ్నీ సమస్యలకుతోడు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని, ఆయన కిడ్నీలు కేవలం 20 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని వైద్య వర్గాల సమాచారం.

కాగా, దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌ సీఎంగా ఉన్న కాలంలో పశువులకు దాణా నిమిత్తం జరిపిన కొనుగోళ్లపై అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు నిరూపితమింది. దీంతో ఆయనకు 2017 డిసెంబరు నెలలో జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన అత్యధిక కాలం జైల్లోనే గడిపారు. మధ్యలో పెరోల్, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో బందోబస్తు మధ్య గడిపారు.

రూ. 3.50 కోట్లను ఆయన అక్రమంగా ప్రభుత్వ నిధుల నుంచి విత్ డ్రా చేశారన్న అభియోగాలు రుజువయ్యాయి. ఆయనపై మరికొన్ని కేసులూ నిరూపితం అయ్యాయి. వీటన్నింటిలో విధించబడిన శిక్షను ఆయన ఏకకాలంలో అనుభవిస్తున్నారు.

తాజాగా, ఆయన ఆరోగ్యం విషమించడంతో బీహార్‌లో పోలీసు బందోబస్తును పెంచారు. కాగా, ఏడేళ్ల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారన్న సంగతి విదితమే. ఐదేళ్ల పాటు ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రిగానూ సేవలందించారు.దీనిపై మరింత చదవండి :