శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (16:21 IST)

ఓడిపోయేందుకే సీటు ఇవ్వాలా? - కాంగ్రెస్‌పై లాలు సెటైర్లు

గడ్డి స్కామ్‌లో జైలుశిక్షను అనుభవిస్తూ ఇటీవల బెయిలుపై విడుదలైన ఆర్జీడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, తన విమర్శలను సెటైర్ల రూపంలో వేశారు. త్వరలో బీహార్‌లో జరిగే రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్లనున్న ఆయన కాంగ్రెస్‌తో పొత్తును వద్దనుకునే రీతిలో మాట్లాడారు. 
 
ఈ రెండు సీట్లలో ఒకదాన్ని ఎందుకు కాంగ్రెస్‌కు ఇవ్వలేదని ఢిల్లీలో విలేకరులు ప్రశ్నించినప్పుడు 'ఓడిపోయి డిపాజిట్‌ కోల్పోవడానికే టిక్కెట్‌ ఇవ్వాలా?' అని ఎదురు ప్రశ్న వేశారు. 
 
కాంగ్రెస్‌ పార్టీ బిహార్‌ ఇన్‌ఛార్జి భక్త్‌ చరణ్‌దాస్‌పైనా విమర్శలు గుప్పించారు. 'ఆయనకేం తెలుసు? భక్త్‌ చరణ్‌.. భాక్‌చోన్‌హార్‌ (మూర్ఖుడు)' అని వ్యాఖ్యానించారు. 
 
ఆర్జేడీ ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉండబోదని భక్త్‌ చరణ్‌ ఇంతకుముందు చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విమర్శ చేశారు. కుశేశ్వర్‌ ఆస్థాన్‌ స్థానంలో పొత్తులో భాగంగా గతంలో కాంగ్రెస్‌ పోటీ చేయగా, ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి దీన్ని కేటాయించలేదు.
 
 
 
ఇదే రెండు పార్టీల మధ్య వివాదానికి దారి తీసింది. దీంతో పాటు, తారాపూర్‌ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. వైద్యుల సలహా మేరకు ప్రచారంలో పాల్గొంటానని లాలు చెప్పారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ, జేడీ(యూ)లు తలపడుతున్నాయి. జేడీ(యూ) సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మృతి కారణంగా ఈ ఉప ఎన్నికలు జరుగుతుండడంతో వాటిని నిలుపుకోవడానికి ముఖ్యమంత్రి నీతీశ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 
 
 
ఇక్కడ కాంగ్రెస్‌ కూడా అభ్యర్థులను నిలబెట్టింది. మూడేళ్ల విరామం అనంతరం పట్నా చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయన కుమారులు తేజ్‌ ప్రతాప్, తేజస్వీ యాదవ్‌లు విభేదాలు లేనట్టుగా వ్యవహరించారు. 
 
ఇంటికి చేరుకున్న తరువాత మాత్రం తేజ్‌ ప్రతాప్‌ కోపంతో బయటకు వచ్చారు. తండ్రితో గడపడానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. తనకు ఇకపై ఆర్జేడీతో సంబంధం లేదని చెప్పారు. మరోవైపు తాను సగం శిక్ష అనుభవించినందువల్లనే బెయిల్‌ ఇచ్చారని, ఆరోగ్య కారణాలతో కాదని లాలు తెలిపారు.