మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (17:17 IST)

చరిత్ర సృష్టించిన దినకరన్.. జయలలిత కంటే అధిక మెజార్టీతో విజయభేరీ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ చరిత్ర సృష్టించారు.

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ చరిత్ర సృష్టించారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులతో ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
ముఖ్యంగా, 2016లో జరిగిన ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి చేసిన జయలలిత 39,545 ఓట్ల మెజార్టీతో డీఎంకే అభ్యర్థి సిమ్లా ముత్తు చోళన్‌పై గెలుపొందారు. ఇపుడు దినకరన్ ఈ మెజార్టీ కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయభేరీ మోగించాడు. దినకరన్‌కు మొత్తం 89,013 ఓట్లు పోలుకాగా, ఆయన మొత్తం 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొంది, జయలలిత సాధించిన మెజార్టీని బ్రేక్ చేశారు. 
 
ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆఖరి రౌండ్ వరకు టీటీవీ దినకరన్ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయబావుటా ఎగురవేశారు. మొత్తం 40707 ఓట్ల ఆధిక్యంతో విజయభేరీ మోగించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,76,885 మంది ఓటర్లు ఓటు వేశారు. మొత్తం 19 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరిగింది. 
 
నిజానికి ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య ఉంటుందని, అన్నాడీఎంకే ఓట్లను దినకరన్ చీల్చి డీఎంకే గెలుపునకు బాటలు వేస్తారని ప్రతి ఒక్కరూ అంచనా వేశారు. కానీ, ఈ అంచలాన్నింటినీ తారుమారు చేస్తూ, మెరీనా తీరంలోని జయలలిత సమాధి సాక్షిగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
ఈ ఎన్నికల్లో జయలలితకు సరైన వారసుడిని తానేనంటూ బరిలోకి దిగిన దినకరన్‌ను ఆర్కే నగర్ ఓటర్లు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఫలితంగా ఆయన గెలుపు మెజార్టీ ఎవరికీ అందనంత దూరంలో నిలిచింది. నిజానికి, ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు జయలలితకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న వీడియోను దినకరన్ వర్గం విడుదల చేయడంతోనే మొత్తం సమీకరణలు మారిపోయాయని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండటం, అప్పట్లో జయ వెంట నడిచి, ఆర్కే నగర్ స్థానాన్ని ఆమె కోసం వదిలేసిన వెట్రివేల్‌ను తన వర్గంలో కలుపుకోవడం దినకరన్‌కు కలిసొచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ప్రభుత్వం కావాలనే తనపై కుట్ర చేస్తోందన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సఫలమయ్యారని, అది ఆయనపై సానుభూతి పెరిగేలా చేసిందని, అందుకే ఇంత భారీ మెజారిటీతో ఆయన విజయం సాధ్యమైందని కొందరు విశ్లేషిస్తుంటే, విపక్ష పార్టీల నేతలు మాత్రం ఒక్కో ఓటుకు రూ.10 వేల చొప్పున దినకరన్ వెచ్చించడమే కాకుండా, విజయం తర్వాత కూడా ఇంటికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గ ఓటర్లకు హామీ ఇచ్చారనీ, అందువల్లే ఓటర్లు భారీగా తరలివచ్చి దినకరన్ ఎన్నికల గుర్తు కుక్కర్‌కు ఓటు వేశారని వ్యాఖ్యానిస్తున్నారు.