సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (13:58 IST)

ఉమ్మి వేయడం ద్వారా రూ.5.13 కోట్లు ఆదాయం.. ఎలా?

cash
ఉమ్మి వేయడం ద్వారా రూ.5.13 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఏంటి.. ఉమ్మి వేయడం ద్వారా ఎలా ఆదాయం వచ్చిందన్నదే కదా మీ సందేహం. అదేనండీ.. ఎంతో శుభ్రంగా ఉండే రైల్వే స్టేషన్, వాటి పరిసర ప్రాంతాల్లో ఉమ్మి వేసే ప్రయాణికుల నుంచి అవరాధ మొత్తంగా ఈ సొమ్మును వసూలు చేశారు. గత 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలలో రైల్వే ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మివేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి రూ.5.13 కోట్లు వసూలు చేశామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.
 
గత రెండేళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో ప్రశ్న వేశారు. అలాగే రైల్వే పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రం చేసిన వారిపై తీసుకున్న చర్యలను అడిగారు. వారిపై వేసిన పెనాల్టీ మొత్తం ఎంత అని మంత్రిని అడిగారు. దీనికి కేంద్రమంత్రి స్పందిస్తూ... పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని, రైల్వే ప్రాంగణాన్ని సరైన నిర్వహణ, పరిశుభ్రమైన స్థితిలో ఉంచేందుకు ప్రతి ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైల్వే ప్రాంగణాలను మురికిగా లేదా చెత్తగా చేయవద్దని ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
 
రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదన్నారు. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలలో చెత్తవేసినందుకు, ఉమ్మివేసినందుకు గాను దాదాపు 3,30,132 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు. వారికి విధించిన జరిమానా ద్వారా 5.13 కోట్ల వచ్చాయన్నారు. ఉమ్మివేయడం, చెత్తవేయడానికి సంబంధించిన జరిమానాల మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదన్నారు.