సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (14:37 IST)

వారణాసిలో మోడీపై జవాను పోటీ ... గెలుపు కోసం కాదు.. ఎండగట్టేందుకు..

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మరోమారు పోటీ చేయనున్నారు. అయితే, ఆయనపై ఓ జవాను పోటీ చేయనున్నారు. ఈ జవాను ఎవరో కాదు. తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ఓ వీడియోను గతంలో రిలీజ్ చేశారు. ఇది వైరల్ కావడంతో బీఎస్ఎఫ్ విధుల నుంచి తప్పించింది. 
 
ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీపై తాను పోటీకి దిగుతున్నట్లు తేజ్ బహదూర్ ప్రకటించారు. వారణాసి నుంచి మోడీపై పోటీ చేయనున్నట్టు తెలిపారు. ప్రధానిపై పోటీకి దిగుతానని చెప్పగానే పలు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయనీ, అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు, మాట్లాడేందుకే తాను ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తేజ్ బహదూర్ వెల్లడించారు. 'ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం అన్నది ముఖ్యం కాదు. భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో కేంద్రం వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నా. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోడీ యత్నిస్తున్నారని ఆరోపించారు. 
 
అదేసమయంలో రక్షణ రంగానికి లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నా... జవాన్ల సంక్షేమం కోసం ఆయన చేసిందేమి లేదని ఆరోపించారు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.