సెలూన్‌కు వెళ్తున్నారా? జాగ్రత్త సుమా.. కరోనా అలా వస్తుంది..?
అవును.. సెలూన్‌కు వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తపడండి. ఎందుకంటే కరోనా వ్యాపించజేయడంతో ఓ హెయిర్ సెలూన్ నిర్వాహకుడు కూడా వున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం మే 3వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో 9 కొత్త కరోనా సోకిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆరు కేసులు ఒకే గ్రామానికి చెందినవి. వీరిలో గ్రామానికి చెందిన హెయిర్ సెలూన్ నిర్వాహకుడు కూడా ఉన్నాడు. ఇతడే ఆ గ్రామంలోని వ్యాధి వ్యాప్తికి కారణమయ్యాడు. షాపులో కటింగ్ చేసేటప్పుడు ఓ వస్త్రాన్ని కప్పేవాడు. సెలూన్‌కి వచ్చిన వారందరికీ కటింగ్ చేసే సమయంలో అదే వస్త్రాన్ని వినియోగించాడు. ఈ కారణంగానే చాలా మందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ గ్రామ సరిహద్దులన్నీ మూసి వేశారు.
కాగా... దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతించిన కేంద్రం.. తమ ఆదేశాలు కేవలం అమ్మకాలు సాగించే దుకాణాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.
అటు హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలు తెరవడం కోసం తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ జేఎస్ పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరవచ్చని.. పట్టణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చునని తెలిపారు. కాగా, షాపింగ్ మాల్స్, మార్కెటింగ్ కాంప్లెక్సులలో దుకాణాలు మాత్రం తెరవడానికి వీల్లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.