బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జనవరి 2021 (15:16 IST)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శశికళ - తమిళనాడులో ఉత్కంఠ

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత స్నేహితురాలు వీకే శశికళ ఆదివారం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. 
 
ఈ కేసులో ఆమె పరప్పణ అగ్రహారం జైలు శిక్షను అనుభవించారు. అయితే, ఇటీవల జ్వరంతో బాధపడగా.. హాస్పిటల్‌కు తరలించారు. దీంతో ఆమెకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలగా.. చికిత్స తీసుకున్నారు. 
 
శశికళకు పదిరోజుల చికిత్స పూర్తయిందని బెంగ‌ళూరు వైద్య కళాశాల హాస్పిటల్‌ వైద్య బృందం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. ఆమెకు ఎలాంటి క‌రోనా‌ లక్షణాలు లేవని, మూడు రోజులుగా ఆక్సిజన్‌ లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారని చెప్పింది. 
 
ఇదిలావుంటే, శశికళ కొద్ది రోజుల పాటు బెంగళూరులోనే ఉండనున్నారు. వచ్చే నెల 8వ తేదీన తిరిగి చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అవినీతి అక్రమాస్తుల కేసులో బెంగళూరులో అపరప్పణ అగ్రహార జైలులో నాలుగేళ్లుగా శిక్ష అభివిస్తున్నారు. 
 
ఈ ఏడాది జనవరి 27తో శిక్ష కాలాన్ని చేసుకోనుండగా.. ఈ క్రమంలో ఈ నెల 21న అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. హాస్పిటల్‌లో ఉండగానే శిక్షాకాలం పూర్తికావడంతో శశికళను విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
ఆమె డిశ్చార్జి అవుతారన్న సమాచారంతో పెద్ద ఎత్తున అభిమానులు హాస్పిటల్‌ వద్దకు తరలివచ్చారు. అయితే తమిళనాడులో ఆమె జైలు నుంచి విడుదల కావడం ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శశికళ తీసుకోబోయే నిర్ణయంపై అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.