శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:42 IST)

శశికళకు జైలు నుంచి విముక్తి : శిక్షాకాలం పూర్తి.. విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ(63) జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను.. శిక్షాకాలం ముగిసినందున బుధవారం విడుదల చేశారు. 
 
అయితే, ఈ నెల 20వ తేదీన కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జైలు అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.
 
జైలు నుంచి విడుదలైనప్పటికీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆమె కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందనున్నారు. ఇంకో 10 రోజులు శశికళకు చికిత్స అవసరమని ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్​‌ అన్నారు.
 
కాగా, శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంగా.. ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విక్టోరియా ఆస్పత్రి ఎదుట భారీ సంఖ్యలో మద్దతుదారులు హాజరై స్వీట్లు పంచుకున్నారు. 
 
మరోవైపు, శ‌శిక‌ళ‌ ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని, ఆమె ప‌ల్స్ రేటు నిమిషానికి 76గా, బీపీ 166/86గా ఉన్నాయని బెంగ‌ళూరు మెడిక‌ల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ప్ర‌క‌టించారు. 
 
దీంతో ఆమె ఈ రోజు ఆసుప‌త్రి నుంచి ఇంటికి చేరుకునే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఆమెను అధికారులు విడుద‌ల చేసిన అనంత‌రం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాల‌ని ఆమె బంధువులు భావిస్తున్నారు.